Thursday, 12 August 2010

అధిష్టానానికి దాసోహమయ్యే సంధి వద్దు: వైఎస్.జగన్


పార్టీ అధినాయకత్వానికి దాసోహమయ్యే సంధి వద్దే వద్దని కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి తేల్చి చెప్పారు. అలాగే, ఓదార్పు యాత్ర నా వ్యక్తిగతం. నా తండ్రి చని పోయిన తర్వాత రాష్ట్ర ప్రజలకు చేసిన వాగ్ధానం అని ఆయన స్పష్టం చేశారు. అందువల్ల ఓదార్పు ఆపివేసి, అధిష్టానానికి విధేయత ప్రకటించడమే సంధి అయితే... ఆ సంధి నాకు అవసరం లేదని జగన్ కుండబద్ధలు కొట్టినట్టు తెలుస్తోంది. ఎవరెన్ని చెప్పినా, ఎన్ని రకాలుగా ఒత్తిళ్లు వచ్చినా ఓదార్పు యాత్ర ఆపే ప్రసక్తి లేదనే ఆయన కోస్తాంధ్రకు చెందిన ఒక ఎంపీతో చెప్పినట్టు సమాచారం.

అంతేకాకుండా, తన తండ్రి మరణానంతరం రాష్ట్ర కాంగ్రెస్‌తో పాటు.. అటు ప్రభుత్వంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై తన సన్నిహితుల వద్ద ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వినికిడి. తన తండ్రి హయాంలో మంత్రులుగా ఉన్న వారే ఇపుడు ఆరోపణలు గుప్పిస్తున్నా... మంత్రులు మౌనంగా ఉండటంపై జగన్ ఒకింత అసహనంతో ఉన్నారు.

ఏపీఐఐసీలో పది వేల కోట్ల రూపాయల అవినీతి చోటు చేసుకున్నట్టు చేస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే డీఎల్ రవీంద్రారెడ్డి ఆరోపణలపై మంత్రులు ఎందుకు స్పందించడం లేదు? వైఎస్ అనుయాయులమని చెప్పుకొన్న వారు ఈ ఆరోపణలను ఎందుకు తిప్పికొట్టడంలేదు? అని జగన్ కోస్తా జిల్లాలకు చెందిన తన సన్నిహితుల వద్ద వాయిపోయినట్టు తెలిసింది.

అంతేకాకుండా, ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారుడు, రాహుల్ గాంధీ సన్నిహితు, యువ ఎంపీ సందీప్ దీక్షిత్‌, తన మధ్య జరిగిన చర్చలకు పెద్ద ప్రాధాన్యతేమీ లేదని జగన్ తేల్చి పారేశారు. మొత్తం మీద జగన్ అధిష్టానంతో సయోధ్య కుదుర్చుకునేందుకు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. పైపెచ్చు.. తన తండ్రి హయాంలో భారీ ఎత్తున అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నట్టు వస్తున్న వార్తలపై ఆయన తీవ్ర ఆగ్రహం, అసహనాన్ని ప్రదర్శిస్తున్నారు.

www.Teluguveera.com is not responsible for the accuracy, compliance, copyright, legality,decency, or any other aspect of the content of other linked sites.Sometimes we post the links from other sites that are on the Internet.

No comments:

Post a Comment