Wednesday 18 August 2010

రోబోలొస్తున్నాయ్...


రజనీ నటించిన రోబో ఇప్పుడో సంచలనం. రోబో స్టోరీ ఏమిటన్నది పక్కన పెడితే... ఫ్యూచర్‌లో జరగవచ్చని భావిస్తున్న కొన్ని సంఘటనలకు ముందుగానే రూపం ఇచ్చాడు డైరెక్టర్ శంకర్. రోబోలు మనిషి జీవితంలోకి ఎలా చొచ్చుకువస్తాయో ఈ రోబో సినిమాలో చూపించాడు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో తమకు తామే నిర్ణయాలు తీసేసుకోగల రాబోలు ఇప్పుడు వచ్చేస్తున్నాయి. మంచికి వాడుకుంటే వాటివల్ల ఎంత ఉపయోగమో.. చెడుకు వాడుకుంటే అంత నష్టమూ సంభవిస్తుంది. మరి ఫ్యూచర్ రోబోటిక్స్ ఎలా ఉండబోతున్నాయి.. రోబోలోకం ఆవిష్కృతమవుతుందా..? ఈ ప్రపంచం రోబోలతో నిండిపోతుందా.. ? రోబో లేనిదే మనిషి బతకలేని స్థితికి వచ్చేస్తాడా..? రోబోలపై జరుగుతున్న పరిశోధనలు.. మనుషులను తలపించే రోబోలపై ఆసక్తికరమైన విషయాలను మీముందుకు తెచ్చింది 24 గంటలు

హ్యూమనాయిడ్స్..

ఒకప్పుడు రోబోలంటే మెటాలిక్ బాడీతో.. డబ్బాలు ఒకదానిపై ఒకటి పేర్చినట్లు కనిపించేవి. కానీ, ఇప్పుడు ఆ గెటప్ పూర్తిగా మారిపోయింది. న్యూస్టైల్‌తో తయారైన హ్యూమనాయిడ్స్ వచ్చేశాయి. మనిషిలా కనిపిస్తూ.. మనిషిలా పనిచేయడం వీటి ప్రత్యేకత. వీటిని అభివృద్ధి చేయడంలోనే.. జపాన్,కొరియాలాంటి టెక్నికల్లీ డెవలప్‌డ్ కంట్రీస్ తలమునకలై ఉన్నాయి.
పైకి చూడడానికి మనిషి బాడీనే ఉంటుంది. ఎంతో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే తప్ప అది రోబో అని చెప్పలేం. మనిషి చేయగలిగే పనులన్నీ చేయడమే ఈ నయా రోబోల స్పెషాలిటీ. మనం మాట్లాడినట్లే మాట్లాడతాయి. కనిపించివారితో ఇంటరాక్ట్ అవుతాయి. ఏవైనా ప్రశ్నలు వేస్తే.. వాటికీ సమాధానం చెబుతాయి. కానీ.. స్కిన్‌ను తీసి చూస్తేమాత్రం లోపలంతా వైర్లు, చిప్స్‌తో నిండిపోయి ఉంటుంది. ఇప్పుడు తయారయ్యే రోబోలు పవర్‌ఫుల్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక్కసారి చూస్తే.. ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకోగలుగుతాయి.
ఆనందం, దుఖం, కోపం, విసుగు, నిరాశ ఇలాంటి ఫీలింగ్స్ అన్నీ ఇప్పటివరకూ మనిషికే సొంతం. ఇప్పుడు మనిషిలా మారుతున్న రోబోకూడా వీటిని అందిపుచ్చుకొంటోంది. ఫీలింగ్స్‌ను ప్రదర్శించగలిగే రోబోలు రెడీ అవుతున్నాయి. సందర్భానికి తగ్గట్లుగా మాటలతో పాటు భావాలను పలికించడం వీటి ప్రత్యేకత.
అందుకే.. వీటిని రోబోలని పిలవడం మానేశారు. మనిషిలా మారాక కూడా మరమనిషిని పిలిస్తే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకే.. సింపుల్‌గా హ్యుమనాయిడ్స్ అంటున్నారు. యంత్రంలా కనిపించే దశనుంచి మనిషిలా కనిపించే స్థాయికి ఎదిగిన రోబో.. మరో రెండు మూడు దశాబ్దాల్లో పూర్తిగా మనిషిలా మారిపోయినా ఆశ్చర్య పోనక్కరలేదు. ఇది కేవలం ఊహమాత్రమే కాదు.. వాస్తవం కూడా. మరో ఇరవైఏళ్లలో రోబోలోకం సాకారం కాబోతోంది. ఈ ప్రపంచ మంతా రోబోలతో నిండిపోవచ్చు.

కేవలం యంత్రమేనా..?


ఫీలింగ్ ఉండదు.. స్పర్శ ఉండదు. కేవలం మరమనిషి. చెబితే తప్ప ఏ పనీ చేయదు. ఇవన్నీ రోబో లక్షణాలు. కానీ, ఈ అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిన రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఎందుకంటే సెన్సిటివ్‌రోబోలు తయారయ్యాయి. ఫ్రెంచ్ కంపెనీ ఆల్డీబరాన్ రోబోటిక్స్ తయారు చేసిన నావో రోబోను చూస్తే.. మీ ఆలోచనలు కచ్చితంగా మారిపోతాయి. కిందలింక్‌ను క్లిక్ చేసి నావో పనితీరును చూడొచ్చు.
http://www.youtube.com/watch?v=2STTNYNF4lk

మీడియం సైజ్‌లో ఉండే ఈ రోబో పూర్తిగా స్వతంత్ర రోబో. దానంతట అదే నిర్ణయాలు తీసుకొని అమలు చేసేస్తుంటుంది. మనుషులను గుర్తిస్తుంది. ఎవరైనా ఏమైనా చెబితే బుద్ధిగా వాటిని చేసేస్తుంది. అంతేనా.. తనలాంటి రోబోలు ఎదురుపడితే వాటితో ముచ్చటిస్తుంది కూడా. కేవలం అరమీటరు ఎత్తుండే ఈ నావోకు మనిషి భావాలను తెలుసుకుని ప్రవర్తించడమూ తెలుసు. అందుకే.. రోబోటిక్స్‌లో ఇప్పుడు నావో ఓ సంచలనం.
నోవో కన్నా పెద్దగా ఉండే మరో అద్భుతమైన రోబోను హోండా కంపెనీ తయారు చేసింది. అదే అసిమో. ఇళ్లల్లో ఉపయోగించుకోవడానికి పూర్తిగా అనువైన రోబో అని హోండా కంపెనీ చెబుతోంది. అంతేకాదు.. మనిషిలా పనిచేయడానికి వీలుగా దీనికోసం ఎన్నో ప్రయోగాలు చేశారు. మనిషి ఎలా నడుస్తాడన్న సూత్రాన్ని ఆధారంగా చేసుకుని, దీని కాళ్లను రూపొందించారు. అందుకే.. మెట్లను సైతం అవలీలగా అసిమో ఎక్కగలదు. ఇంటిలో చక్కగా తిరుగుతూ అన్ని పనులనూ అసిమో చేసిపెడుతుంది. చెప్పాలంటే.. ఓ మనిషి ఎలా పనిచేస్తాడో.. అలానే చేస్తుంది. మనుషుల్ని, వస్తువులను గుర్తించడం వాటిని గుర్తుపెట్టుకోవడం కూడా అసిమోకు వచ్చు. ఒక్కోసారి ఏదైనా వస్తువును సరిగ్గా చూడకుండా మనం కాలితో తన్నేస్తామేమో గానీ.. ఈ హోండా హ్యుమనాయిడ్ మాత్రం ఆ పని చేయదు. కిందలింక్‌ను క్లిక్ చేసి అసిమో పనితీరును చూడొచ్చు.
http://www.youtube.com/watch?v=kFgXEkzMq7A


ప్రతీపనికీ ఓ రోబో


టిఫిన్ చేసుకోవడం.. వంట వండుకోవడం ఇబ్బందిగా ఉందా? అయితే రోబో చెఫ్ మీకు చాలా ఉపయోగపడుతుంది..
ప్రతీరోజు కూరగాయలు తరగడం చికాకుగా ఉందా.. అయితే.. రోబోకు అప్పజెప్పండి. క్షణాల్లో మీ పని అయిపోతుంది.
వంటపనిలో సాయం చేయడానికి.. ఫుడ్ ఐటెమ్స్ తయారు చేయడానికి ఎన్నో రకాల రోబోలు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి.
ఇక స్పెషల్‌గా చెప్పుకోవాల్సిన రోబో మరొకటుంది. ఇంటిపనులు చేసిపెట్టే ఆల్‌రౌండర్ రోబోను జపాన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ టోక్యో పరిశోధకులు తయారు చేశారు. భోజనం అయిపోయిన తర్వాత వదిలేసిన డిష్‌లను తీసుకువెళ్లిపోతుంది. వాటిని క్లీన్ చేయమని రోబోటిక్ ఆర్మ్‌కు అప్పగిస్తుంది. మాసిన బట్టలుంటే వాటిని వాషింగ్ మెషిన్లో వేసేస్తుంది. అంతేకాదు.. ప్రతీరోజు ఇంటిని క్లీన్ చేయడం కూడా దీని డ్యూటీనే. ఇంటిపనులు చేసిపెట్టడానికి, పేషెంట్స్ ఉంటే హెల్ప్ చేయడానికి మరో రోబోను కూడా జపాన్ పరిశోధకులు డెవలప్ చేశారు. ఇంట్లో చెత్త ఎక్కువైతే దాన్ని పారబోయడానికి కూడా ప్రత్యేక రోబోలు తయారయ్యాయి.
ఇలా ఒకటీ రెండు కాదు.. కాలు కిందపెట్టకుండానే మన పనులు చేసి పెట్టడానికి రోబోలు రెడీ అవుతున్నాయి. చిన్న ప్రోగ్రామ్‌ ఫీడ్ చేస్తే చాలు.. వరసగా దానంతట అదే అన్ని పనులను చేసేస్తుంది. భవిష్యత్తులో మన అవసరాలను అర్థం చేసుకుని పనిచేసే రోబోలను తయారు చేయాలన్నది సైంటిస్టుల ప్లాన్.

రోబోనాట్..

అంతరిక్ష ప్రయోగాల్లో రోబోలు ఎప్పటినుంచో పాలు పంచుకుంటున్నాయి. ఇవన్నీ చాలావరకూ క్రేన్‌ల రూపంలోనో, రోవర్ల రూపంలోనో ఉన్నాయి. మనిషిని పోలిన రోబో ఒక్కటి కూడా ఇంతవరకూ అంతరిక్షంలోకి వెళ్లలేదు. ఇప్పుడు ఆ ఘనత రోబోనాట్‌ - R2కు దక్కించుకోబోతోంది. నాసా, జనరల్ మోటర్స్ సంయుక్తంగా పరిశోధనలు చేసి రూపొందించిందే.. ఈ రోబోనాట్. దీనికి సాధారణ రోబోల తరహాలో కాళ్లుండవు. కేవలం బాడీ మాత్రమే ఉంటుంది. జీరోగ్రావిటీలో సులువుగా పనిచేయడం కోసం ఈ తరహా డిజైన్‌ను రూపొందించారు. 350కి పైగా సెన్సార్లను ఇందులో అమర్చారు. నవంబర్ 1న భూమిపై నుంచి అంతరిక్షకేంద్రానికి ఈ రోబో వెళ్లనుంది. అక్కడ ఉన్న వ్యోమగాములకు పరిశోధనల్లో సహాయం చేస్తుంది. చెప్పాలంటే, ఆస్ట్రోనాట్‌లు చేసే పనులన్నింటినీ ఈ రోబోనాట్ చేయగలదు. ఇక ఇంటర్నెట్‌ను వాడుకోవడంలో దీని స్టైలే వేరు. అంతరిక్ష కేంద్రం నుంచి ట్విట్టర్‌లో ట్వీట్స్ పంపిస్తుంది.
రోబోనాట్ విజయవంతంగా పనిచేయగలిగితే.. మరో మహా ప్రయోగానికి తెర లేచినట్లే. ప్రాజెక్ట్ M పేరుతో అమెరికాలోని జాన్షన్ స్పేస్‌సెంటర్ దీనికోసం ప్రతిపాదనలను కూడా ఇప్పటికే సిద్ధం చేసింది. మరో మూడేళ్లలోగా.. రోబోనాట్‌ను చంద్రుడిపైకి పంపిచాలన్నది ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. చంద్రుడిపై ప్రయోగాల కోసం వ్యోమగాములను కాకుండా కేవలం రోబోలను మాత్రమే పంపిస్తారు.
చంద్రుడిపై వ్యోమగాములు ఎక్కువ కాలం ఉండలేరు కాబట్టి, రోబో ద్వారా అన్వేషణ కొనసాగించాలన్నది నాసా ఆలోచన. పూర్తిగా మనిషిలా ఉండే ఈ రోబోనాట్.. చంద్రుడిపైకి వెళితే మాత్రం ఎన్నో విలువైన విషయాలు.. చంద్రుడిపై దాగున్న రహస్యాలు భూమికి చేరతాయనడంలో ఏమాత్రం సందేహం లేదు.

నాశనం చేస్తాయా..?

ఇంతవరకూ చెప్పుకొంది హ్యూమన్ ఫ్రెండ్లీ రోబోల గురించే. మనిషిలా మారుతున్న రోబోకు మేథస్సు కూడా పెరుగుతోంది. స్వతంత్రంగా ఆలోచించగలుగుతోంది. ఈ ఆలోచనలే రోబోను మనిషికి శత్రువును చేస్తాయా.. మన వినాశనానికి దారి తీస్తాయా.. చాలామందిలో ఇప్పుడు ఇదే ఆందోళన.
రోబోటిక్స్ డెవలప్ అయ్యే కొద్దీ టెన్షన్ పెరుగుతోంది. మనలా ఆలోచించగలిగే శక్తిని సంపాదించుకుంటున్న రోబోలు, చివరకు మనల్నే నాశనం చేస్తాయోమేనన్న ఆందోళనను కలిగిస్తున్నాయి. హాలీవుడ్‌లో వచ్చిన కొన్ని సైన్స్ ఫిక్షన్ సినిమాలు .. ఈ టెన్షన్‌ను మరింత పెంచాయి.
సొంతగా ఆలోచించి, నిర్ణయాలు తీసుకునే శక్తి రోబోకు వచ్చేసిందంటే.. మనిషి కంట్రోల్‌లో ఉండకపోవచ్చన్నది చాలామంది నమ్మకం. తనను బానిసగా చూస్తున్న మనిషిపై దాడిచేసి.. ప్రపంచాన్ని తనగుప్పిటలోకి సూపర్‌రోబోలు తెచ్చుకుంటాయేమోనన్న భయమూ ఉంది.
అయితే.. ఇదంతా సులువు కాదు. ప్రోగ్రామింగ్ ఆధారంగా తయారయ్యే రోబో ఆలోచనలకూ కొన్ని పరిమితులుంటాయి. మనిషిపై ఆధిపత్యం చెలాయించాలన్న ఆలోచన రోబోకు రాదనే చెప్పొచ్చు. కాబట్టి వాటివల్ల మనకు పెద్దగా సమస్యలు రావు. కానీ.. సంఘవిద్రోహుల చేతికి రోబో టెక్నాలజీ అందిందంటే మాత్రం పెను ప్రమాదమే ముంచుకొస్తుంది. మనిషికి మేలు చేసే రోబోను కాస్తా.. విధ్వంసకారిగా మార్చడం పెద్ద కష్టం కాకపోవచ్చు. ఇలాంటి రోబోలు కొన్ని తయారైనా.. మానవాళికి మనుగడకు కష్టమే.


Source:24gantalu


www.Teluguveera.com is not responsible for the accuracy, compliance, copyright, legality,decency, or any other aspect of the content of other linked sites.Sometimes we post the links from other sites that are on the Internet.

No comments:

Post a Comment