Thursday, 12 August 2010
తెదేపాకు తెలంగాణాలో నూకలు చెల్లిపోయినయ్: కేసీఆర్
తెలుగుదేశం పార్టీ నాయకుడు హరికృష్ణ తెరాసకు రాసిన బహిరంగ లేఖకు తెరాస చీఫ్ కేసీఆర్ కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీకి తెలంగాణాలో నూకలు చెల్లిపోయినయ్ అని అన్నారు. గావుకేకలు, పెడబొబ్బలు మానుకుని ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడమంటూ హరికృష్ణకు హెచ్చరిక చేశారు.
తెలుగుదేశం పార్టీ కథంతా తెలంగాణా ప్రజలకు తెలిసిపోయిందనీ, అందుకే డిపాజిట్లు గల్లంతు చేసి ఇంటికి పంపిచారన్నారు. తామేదో తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేస్తామని అన్నామనీ హరికృష్ణ పెడబొబ్బలు పెడుతున్నాడనీ, కానీ నిజంగా భూస్థాపితం చేస్తున్నది తెలంగాణా ప్రజలేనని కేసీఆర్ చెప్పుకొచ్చారు.
లేఖ కూడా సరిగ్గా రాయలేని హరికృష్ణ గతం తెలుసుకుని మాట్లాడాలన్నారు. ముఖ్యమంత్రిగా తొమ్మిదేళ్లు పదవి చేపట్టి తెలంగాణా రొమ్ము గుద్దింది చంద్రబాబు నాయుడేనని ధ్వజమెత్తారు. సీమలో ఉన్న తెలంగాణా ఉద్యోగుల్ని తరమగొట్టింది తెదేపా హయాంలోనని విమర్శించారు. అదే సమయంలో 610 జీవో ప్రవేశపెట్టి తెలంగాణా నుంచి ఆంధ్రప్రాంత ఉద్యోగులను పంపిస్తామని బులపుచ్చకాయ మాటలు చెప్పిండ్రు తప్పించి ఎట్టి పరిస్థితుల్లోనూ చర్యలు తీసుకున్న పాపాన పోలేదన్నారు.
తెలంగాణాలో ఆత్మహత్యల పరంపర చంద్రబాబు కాలంలోనే చోటుచేసుకున్నాయన్నారు. అదేవిధంగా హైదరాబాదులోని భూములను కార్పొరేట్ గద్దలకు కట్టబెట్టిన ఘనుడు మీ బావ అని హరికృష్ణను ఉద్దేశించి అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణా ప్రజలకు న్యాయం జరగదన్నారు. ఎందుకంటే అది ఆంధ్రవారి చేతిలో ఉన్నది కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణాకు చెందిన నాయకుడు ముఖ్యమంత్రి కాలేడన్నారు.
"అయినా మీరు పల్లకిలో కూచుంటే.. మేము బోయిల్లా మోయాలా...? చప్రాసీల్లా పని చేయాలా...? మీ దగ్గర గులాంలా పడుండాలా.. తెలంగాణా ప్రజలు అన్నీ తెలుసుకున్నారు. ఇక ఇక్కడ మీ ఆటలు సాగవ్" అంటూ హెచ్చరించారు.
గత ఏడాది డిసెంబరు భారతప్రభుత్వం తెలంగాణాకు అనుకూలంగా ప్రకటన ఇచ్చిన క్షణాల్లోనే చంద్రబాబు ఉలిక్కి పడి లేచి.. రాత్రంతా నిద్రపోకుండా పడుకున్న కాంగ్రెస్ పార్టీవాళ్లను కూడా లేపి సీమాంధ్రలో కృత్రిమ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది చంద్రబాబే అని ఆరోపించారు. కుట్రలు, కుతంత్రాలు చంద్రబాబుకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియవని కేసీఆర్ మండిపడ్డారు.
జార్ఖండ్ ఏర్పడిన తర్వాత ఆ రాష్ట్రంలో లాలూ పార్టీ ఎలా కనిపించకుండా పోయిందో అలాగే తెలంగాణా ఏర్పడిన తర్వాత తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టుక పోతుందని జోస్యం చెప్పారు. ఇకనైనా నిజం తెలుసుకుని మసలుకుంటే మంచిగుంటదని కేసీఆర్ హెచ్చరించారు.
www.Teluguveera.com is not responsible for the accuracy, compliance, copyright, legality,decency, or any other aspect of the content of other linked sites.Sometimes we post the links from other sites that are on the Internet.
Labels:
articles,
Chit Chats And News,
posts
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment