Wednesday 28 July 2010

వైయస్ జగన్ కాంగ్రెసు పార్టీ విప్ ను గౌరవిస్తారా?


తూర్పు గోదావరి జిల్లాలో ఓదార్పు యాత్ర చేస్తున్న కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కాంగ్రెసు నాయకత్వం జారీ చేసిన విప్ ను గౌరవిస్తారా అనేది అనుమానంగానే ఉంది. ధరల పెరుగుదలపై ప్రతిపాదించిన వాయిదా తీర్మానం మేరకు తక్షణ చర్చకు ప్రతిపక్షాలు పట్టుబడుతున్న నేపథ్యంలో లోకసభకు తప్పనిసరిగా హాజరు కావాలని కాంగ్రెసు తన పార్లమెంటు సభ్యులకు విప్ జారీ చేసింది. ఈ నెల 28వ తేదీ వరకు జగన్ తూర్పు గోదావరి జిల్లాలో ఓదార్పు యాత్ర నిర్వహించనున్నారు. పార్లమెంటు సమావేశాలకు డుమ్మా కొట్టడానికే ఆయన ఓదార్పు యాత్రను పొడగించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ స్థితిలో ఆయన పార్టీ విప్ ను గౌరవించే అవకాశం లేదని అంటున్నారు. అంతేకాకుండా పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించడానికే జగన్ దాన్ని పరిగణనలోకి తీసుకునే అవకాశం కూడా లేదని అంటున్నారు.
పెరిగిన ధరలపై విస్తృతమైన చర్చకు కాంగ్రెసు పార్టీ సిద్ధంగా ఉందని పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ బుధవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. డిఎంకె, టిఎంసి ప్రభుత్వాన్ని సమర్థిస్తాయా అని అడిగితే ప్రతిపక్షం తమ ఐక్యతను సందేహించాల్సిన అవసరం లేదని ఆయన సమాధానమిచ్చారు. పార్లమెంటు నడిచి అర్థవంతమైన ఫలితం సాధించాలనేదే తమ వ్యూహమని ఆయన అన్నారు. చాలా బిల్లులు పెండింగులో ఉన్నాయని ఆయన చెప్పారు.

www.123tollywoodcinemalu.blogspot.com is not responsible for the accuracy, compliance, copyright, legality,decency, or any other aspect of the content of other linked sites.Sometimes we post the links from other sites that are on the Internet.

No comments:

Post a Comment