Sunday 21 November 2010

ఉక్కుమనుషులు... వస్తున్నారు

ఎదుటి మనిషిని ఓడించాలంటే తెలివి మాత్రమే కాదు.. బలం కూడా ఉండాలి. అవతలి వ్యక్తి శక్తిని తట్టుకునే సామర్థ్యం ఉండాలి. వీరోచిత విన్యాసాలు చేయాలంటే.. అంతులేని శక్తి కావాలి. మరి అప్పటికప్పుడు ఆ శక్తిని సంపాదించుకోవడం ఎలా.. ? సాధ్యమేనంటున్నారు పరిశోధకులు. అదికూడా ఒకే ఒక్క సూట్‌తో..

శత్రువు ఎంత బలవంతుడైనా.. ఈ సూట్ వేసుకుంటే ఏమీ చేయలేడు.


ఈ సూట్‌తో ఎలాంటి ప్రమాదాల నుంచైనా బయటపడవచ్చు.

గాల్లో ఎగిరిపోవచ్చు... ఆకాశంలో విహరించవచ్చు.. ఎక్కడికైనా క్షణాల్లో వెళ్లిపోవచ్చు. శరీరాన్నే ఆయుధంగా మార్చుకోవచ్చు. చేతులనే వెపన్స్‌గా వాడుకోవచ్చు. ఒకే ఒక్కడు వందలాదిమందితో పోరాడవచ్చు..


ఎక్కడకావాలనుకుంటే అక్కడ సూట్‌ను వేసుకోవచ్చు.. వద్దనుకుంటే విప్పేయవచ్చు.. సాధారణ వ్యక్తిని కూడా మహా బలశాలిని చేస్తుందీ సూట్.


మనుషులే యంత్రాలుగా మారిపోవచ్చు..

ఏదో హాలీవుడ్ సినిమాగురించి చెబుతున్నట్లు అనిపించినా.. త్వరలోనే ఇవన్నీ నిజమవబోతున్నాయి. ఎవరైనా వేసుకునే వీలుండే ఐరెన్‌మ్యాన్ సూట్లు ఇప్పుడు తయారవుతున్నాయి. ఒక్కసూట్ వేసుకుంటే చాలు.. ఒక్కొక్కడు 20 మందికి సమానమైన బలాన్ని అందుకోవచ్చు. మనుషులంతా ఐరెన్‌మ్యాన్‌లుగా మారిపోవచ్చు.


అమెరెకాలో తయారీ..


ఐరెన్‌మెన్ సినిమా స్పూర్తి నిచ్చిందో ఏమో గానీ, అమెరికన్ పరిశోధనా సంస్థలన్నీ ఇప్పుడు ఐరెన్‌మ్యాన్‌లను తయారు చేసే పనిలో పడ్డాయి. అమెరికన్ సైనికులను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకమైన సూట్స్‌ను తయారు చేస్తున్నాయి. ఇప్పటికే ప్రాథమిక పరీక్షలు పూర్తిచేసుకున్న ఈ సూట్లు.. త్వరలోనే అమెరికన్ సైనికులకు అందవచ్చు. సైబోర్గ్‌ల రూపంలో కనిపించేలా అమెరికన్ సైనికుల రూపాన్ని మార్చడంపైనే అందరూ దృష్టి పెట్టారు.



ఎలాంటి దాడినైనా ఎదుర్కొనేలా యూఎస్ ఆర్మీని సిద్దం చేయడమే ఈ సూట్ ప్రధాన ఉద్దేశం. సోల్జర్ శరీరం ఏమాత్రం కనపడకుండా పూర్తిస్థాయిలో కవర్ అయ్యే సూట్లను కూడా కొంతమంది ఇప్పటికే తయారు చేశారు. ప్రాజెక్ట్ గ్రిజ్లీ రూపంలో తయారైన ఓ సూట్ అందరినీ ఆకట్టుకొంటోంది. వెపన్స్, బుల్లెట్స్ అన్నీ పెట్టుకోవడానికి వీలుగా ఈ సూట్‌ సిద్ధమయ్యింది. పైగా బరువు కూడా తక్కువే అంటున్న ఈ సూట్‌లో మరెన్నో ప్రత్యేకతలు కూడా ఉన్నాయి.


చూడడానికి స్టిఫ్‌గా ఉన్నప్పటికీ ఈ సూట్ వేసుకుంటే ఎంతో కన్వీనెంట్‌గా ఉండొచ్చు. ఈ సూట్‌తో పాటే ప్రత్యేకమైన హెల్మెట్‌ కూడా ఉంటుంది. రాత్రివేళల్లో పనిచేయడానికి వీలుగా ఈ హెల్మెట్‌లో ప్రత్యేకమైన లైట్స్ ఉన్నాయి. ఎలాంటి వాతావరణంలోనైనా సైనికులకు ఇబ్బంది లేకుండా చేస్తుంది ఈ గ్రిజ్లీ సూట్.


ఎక్సో స్కెలెటిన్





అమెరికన్ సైనికులకు కొత్త శక్తిని అందించే ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. ఒకే ఒక్క సూట్‌తో తన సైనికులను మహాశక్తిసంపన్నులను చేయాలని అమెరికా భావిస్తోంది. అదే ఎక్సో స్కెలెటిన్ సూట్. ఈ సూట్ వేసుకుంటే అలసటన్నదే లేకుండా యుద్ధరంగంలో దూసుకుపోవచ్చు.



ఈ ఎక్సో స్కెలెటిన్ సూట్‌ను అమెరికా తయారు చేయించడం వెనుక ఎన్నో కారణాలున్నాయి. ముఖ్యంగా తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి అమెరికా అష్టకష్టాలు పడుతోంది. వరల్డ్‌ట్రేడ్ సెంటర్స్‌ను అల్‌ఖైదా కూల్చేసిన తర్వాత అమెరికాకు.. టెర్రరిస్టు సంస్థలకు మధ్య ఎడతెరిపి లేకుండా యుద్ధం సాగుతోంది. తీవ్రవాదులను ఎదుర్కోవడానికి ఏమాత్రం అలవాటులేని ఎడారుల్లో అమెరికన్ సైనికులు రోజుల తరబడి ఉండాల్సి వస్తోంది. పైగా ఎటువైపునుంచి ఏ సమయంలో టెర్రరిస్టులు దాడి చేస్తారో తెలియదు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో పనిచేయడం కష్టమే. వీరి కష్టాలను తీర్చడానికే ఈ ఎక్సోస్కెలెటిన్ సూట్ డెవలప్‌మెంట్‌పై అమెరికా దృష్టి పెట్టింది.



చూడడానికి రోబోలా కనిపిస్తున్న ఈ పరికరం పేరే సార్కోస్ ఎక్సో స్కెలెటిన్. సార్కోస్ అనే సంస్థ దీన్ని డెవలప్ చేస్తోంది. ఇప్పటివరకూ నిర్వహించిన అన్ని టెస్టుల్లోనూ ఇది సక్సెస్ అయ్యింది. దీన్ని శరీరానికి తగిలించుకుంటే చాలు.. సాధారణ మనుషులు కాస్తా ఐరెన్‌మ్యాన్‌లు అయిపోతారు. 20 రెట్ల బలాన్ని దక్కించుకోగలుగుతారు. వంద కేజీల బరువును అత్యంత సులువుగా ఎత్తగలరు.. చెప్పాలంటే భారం అన్నదే ఈ సూట్ వేసుకున్నవారికి తెలియదు.

మెట్లు ఎక్కడంలోనూ.. ఎత్తైన ప్రాంతాలకు చేరుకోవడంలోనూ ఈ సూట్ ఎంతగానే సహాయ పడుతుంది. అల్యూమినియంతో తయారైన ఈ ఎక్సోస్కెలెటిన్‌ను వేసుకోవడంవల్ల అదనపు భారమూ పడదు. పైగా యుద్ధక్షేత్రంలో ఎక్కువ బరువును మోసుకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఈ సూట్ ధరిస్తే.. బరువు మోస్తున్నామన్న ఫీలే సైనికుడికి కలగదట. అందుకే ఈ సూట్ వేసుకోని అవసరమైన పరికరాలను పదార్థాలు వీపున కట్టుకుని ఎంత దూరమైనై వెళ్లిపోవచ్చు. అంతేకాదు.. తోటిసైనికులు గాయపడితే ఈ సూట్ వేసుకొని వారిని రక్షితప్రాంతానికి ఈజీగా మోసుకువెళ్లవచ్చు. 2015 కల్లా ఈ సూట్‌ను అందుబాటులోకి తేవాలని అమెరికా ప్రయత్నిస్తోంది.


అంతులేని బలం



జిమ్‌కు వెళ్లి వంద కేజీల బరువును రెండు మూడు సార్లు ఎత్తాలంటేనే ఆపసోపాలు పడపోతాం. కానీ, ఈ ఎక్సో స్కెలెటిన్ ధరిస్తే.. ఒకటీ రెండూ కాదు.. ఏకంగా ఐదువందల సార్లు ఎత్తినా ఏమాత్రం అలసట రాదు. ఈ సూట్ స్పెషాలిటీ తెలుసుకోవడానికి ఇది చాలు. ఈ సూట్‌లో రెండు పవర్డ్ లెగ్స్ ఉంటాయి. ఓ మినీ కంప్యూటర్ కూడా ఈ సూట్‌లో నిక్షిప్తమై ఉంటుంది. మనిషి శరీర కదలికలను గుర్తిస్తూ.. దానికి అనుగుణంగా రోబోటిక్ లెగ్స్ పనిచేసేలా ఈ కంప్యూటర్ చూస్తుంది. బరువులు మోయడానికి వీలుగా వీపుపై ప్రత్యేక ఏర్పాటు ఉంటుంది. ఈ సూట్ వేసుకున్న తర్వాత వంద కిలోల వరకూ బరువును ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసుకువెళ్లవచ్చు. ఈ బరువునంతటినీ మనం ధరించిన ఎక్సో స్కెలెటన్ మోస్తుంది కాబట్టి దాని ప్రభావం సూట్ వేసుకున్నవారిపై పడదు.


ఈ సూట్‌ను వేసుకోవడం వల్ల నడవడానికి ఎక్కువగా కష్టపడక్కర్లేదు. అంతేకాదు... ఈ సూట్ వేసుకుని నడిస్తే ఎనర్జీ కూడా చాలా తక్కువే వినియోగించుకోవచ్చు. పైగా ఎలాంటి ప్రాంతంలోనైనా అవలీలగా నడవవచ్చు. బరువులు మోస్తూ నడుస్తున్న ఇబ్బంది కలిగించకుండా ఉండడానికి ప్ర్తత్యేకంగా షాక్ అప్ జార్స్ ఉంటాయి. అంతేకాదు.. వంద కిలోల బరువును మోస్తూ కూడా మనం పరుగులు పెట్టవచ్చు.



కూర్చున్నా, నిలుచున్నా, పాకినా.. మన శరీరాన్ని ఎలా కదిపినా ఈ ఎక్సోస్కెలెటిన్ మనకు ఇబ్బందిగా అనిపించదు. మన శరీరంతో పాటే కదులుతుంది. ఈ సూట్‌తో అవసరం లేదనుకున్నప్పుడు క్షణాల్లో విప్పేయవచ్చు. ఓ బ్యాగ్‌లా ఫోల్డ్ చేసి భుజాన తగిలించుకుని వెళ్లిపోవచ్చు. తీయడమే కాదు.. వేసుకోవడమూ చాలా సులువు.


మనిషికి తగ్గట్లుగా అడ్జెస్ట్ చేసుకోవడానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు ఈ సూట్‌లో ఉంటాయి. మినీ కంప్యూటర్ ఆధారంగా మనకు కావల్సినట్లు ఎక్సోస్కెలెటన్ బిహేవియర్‌ను మార్చుకోవచ్చు. ఇలా ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది కాబట్టే.. ఈ ఎక్సో స్కెలెటన్‌పై అమెరికా సైన్యం అంత మోజు చూపిస్తోంది.


సామాన్యుల కోసం కూడా..


కాళ్లకు పట్టీలతో ఇలా నడుస్తున్నారమేటి అని అనుకుంటున్నారా..? ఎక్సో స్కెలెటిన్‌లో ఇది మరో రకం. అయితే.. ఇవి మాత్రం సైనికుల కోసం వాడేవి కాదు. అంతకుమించిన ప్రయోజనం అందించడం కోసం. మానవాళి అందరికీ సహాయం చేయడం కోసం. దీనిపేరు హైబ్రిడ్ అసిస్టివ్ లింబ్. జపాన్‌లో తయారైన ఈ పరికరం ఇప్పుడు ఎంతోమందిలో ఆశలు మొలకెత్తిస్తోంది.


వృద్దాప్యంతో నడుము పడిపోయిన వారు, ప్రమాదాల్లో కాళ్లు పోగొట్టుకున్నవారు, వీల్‌చైర్‌కే పరిమితమైన వారు మళ్లీ లేచి పరుగులు తీసేలా చేస్తుంది ఈ హైబ్రిడ్ లింబ్. దీన్ని తొడుక్కుంటే చాలు ఎలాంటి ఇబ్బందీ లేకుండా నడవగలరు. హాస్పిటల్స్‌లో ఉపయోగకరంగా ఉండే ఎక్సో స్కెలెటన్‌లను తయారు చేసే పనిలో జపాన్ పరిశోధకులు బిజీగా ఉన్నారు. ఎంతటి బరువునైనా ఎత్తగలిగే మెషిన్‌ను తయారు చేస్తున్నారు.


వీల్‌చైర్ల అవసరం లేకుండా రోగులను చేతుల్లోకి తీసుకుని ఆప్యాయంగా తీసుకువెళ్లాలన్నది పరిశోధకుల ప్లాన్. అందుకే, ఎక్సోస్కెలెటన్‌ను అమర్చి ఇలా ప్రయోగాలు కూడా చేస్తున్నారు. ఇవి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే, నడవలేని వారంతా మళ్లీ మామూలు మనుషులు కావడం ఖాయం.

No comments:

Post a Comment