Thursday 9 September 2010

హైదరాబాద్ లేని తెలంగాణ.. తలలేని మొండెం లాంటిది!

హైదరాబాద్ లేని తెలంగాణ తలలేని మొండెం లాంటిదని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నేత హరీష్ రావు అన్నారు. రాష్ట్ర విభజన అనివార్యమైతే రాజధాని హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా చేసే పరిశీలన శ్రీ కృష్ణ కమిటీ ముందు ఉందని ఆ కమిటీ సభ్యుడు వీకే దుగ్గల్ చేసిన వ్యాఖ్యలపై హరీష్ రావు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వంచే నియమించబడిన శ్రీ కృష్ణ కమిటీకి చెందిన ఓ సభ్యుడు మీడియా ముందు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నారు. కాబట్టి దుగ్గల్ వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణాకు తలమాణికంగా గల హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసే పరిశీలన సబబు కాదని ఆయన చెప్పారు. శ్రీ కృష్ణ కమిటీ ఓ సభ్యులైన దుగ్గల్ తొందరపడి వ్యాఖ్యలు చేయకూడదని, అలా ప్రతిరోజూ మీడియాతో మాట్లాడితే లేనిపోని అపోహలకు దారితీసే ప్రమాదముందని హరీష్ రావు వెల్లడించారు. శ్రీకృష్ణ కమిటీ సభ్యుడిగా వీకే దుగ్గల్ బాధ్యతగా వ్యవహరించాలని, కమిటీ వివరాలను సేకరించడానికి మాత్రమే పరిమితం కావాలని హరీష్ రావు చెప్పారు. ఇంకా తెలంగాణ ఏర్పాటు జరగాలని, అందుకు హైదరాబాద్ రాజధాని కావాలని హరీష్ రావు ఆశించారు. ఇదేవిధంగా వీకే దుగ్గల్ ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంలో చేసే పరిశీలన కూడా ఉందని చేసిన వ్యాఖ్యలపై తెరాస నేతలు మండిపడుతున్నారు. ఒకవేళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగితే ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) మాజీ పార్లమెంటు సభ్యుడు వినోద్ కుమార్ అన్నారు. రాష్ట్ర విభజన జరిగితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రాజధాని నగరం హైదరాబాదుకు ఎందుకు రావాలని ప్రశ్నించారు. ఆంధ్ర నుంచి 200 కి.మీ. వరకు ఆంధ్ర ప్రజలు రావాల్సిన అవసరం ఏముందని వినోద్ కుమార్ అడిగారు. ఇంకా రాష్ట్ర ఏర్పాటు జరిగితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో కొత్త హంగులతో ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఏర్పాటు చేసుకోవచ్చునని వినోద్ కుమార్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

No comments:

Post a Comment