Thursday 16 September 2010

కొనసాగుతున్నతెలంగాణ న్యాయవాదుల ఆందోళన

తెలంగాణా న్యాయవాదుల ఆందోళనను విరమింపజేయాలన్న ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించలేదు. చర్చలకు న్యాయశాఖ కార్యదర్శిని పంపుతామన్న సర్కారు ప్రతిపాదనను న్యాయవాదులు తోసిపుచ్చారు. మంత్రులే చర్చలకు రావాలని పట్టుబట్టారు. దీంతో సమస్య ఓ కొలిక్కిరాలేదు. లాయర్ల పోరాటానికి టీఆర్ఎస్ , టీడీపి తెలంగాణా ఫోరం మద్దతు తెలిపాయి. జ్యుడిషియరీ పోస్టుల్లో 42 శాతం వాటా డిమాండ్ చేస్తూ తెలంగాణ న్యాయవాదులు హైకోర్టు వద్ద చేసిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. విధులు బహిష్కరించిన లాయర్లు హైకోర్టు గేట్లు ఎక్కేందుకు ప్రయత్నించారు. దీంతో న్యాయవాదులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. తమకు 42 శాతం కోటా కేటాయించాల్సిందేనని తెలంగాణ న్యాయవాదులు డిమాండ్‌ చేశారు. సమస్యలను పరిస్కరించేందుకు రంగంలోకి దిగిన ప్రభుత్వం న్యాయవాదులతో చర్చలు జరిపింది. మంత్రులు గీతారెడ్డి , మోపిదేవి వెంకటరమణ , అడ్వకేట్ జనరల్ , న్యాయశాఖ కార్యదర్శి , ఇంటిలిజెన్స్ ఐజీలతో ముఖ్యమంత్రి రోశయ్య సుధీర్ఘంగా చర్చించారు. అనంతరం న్యాయవాదులతో చర్చలకు న్యాయశాఖ కార్యదర్శిని పంపుతామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే దీనికి లాయర్లు అంగీకరించలేదు. చర్చలకు మంత్రులే రావాలని పట్టుబట్టారు. దీంతో చర్చలు ఓ కొలిక్కిరాలేదు. హైకోర్టు నియామకాల్లో ఏ ప్రాంతానికీ అన్యాయం జరక్కూడదన్న చిత్తశుద్ధితో ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి గీతారెడ్డి చెప్పారు. గాంధీ మార్గంలో శాంతియుత పరిష్కారం కోసం ప్రయత్నించాల్సింది పోయి న్యాయవాద వృత్తికున్న గౌరవమర్యాదలను మంటగలపడం ఆక్షేపణీయమన్నారు. తెలంగాణా న్యాయవాదుల పోరాటానికి టీఆర్‌ఎస్ , టీడీపి తెలంగాణా ఫోరం మద్దతు పలికాయి. ప్రభుత్వం వెంటనే సమస్య పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిచాయి. న్యాయవాదులకు మద్దతుగా తెలంగాణాలో రాస్తారోకోలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు కేసీఆర్‌ పిలుపు నిచ్చారు. అయితే లాయర్లతో చర్చల విషయం కొలిక్కి రాకపోవటంతో ప్రభుత్వం ఇవాళ కూడా దీనిపై సమీక్షించనుంది.

No comments:

Post a Comment