Wednesday 27 October 2010

చిరంజీవికి శోభారాణి మరో షాక్

ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవికి ఆ పార్టీ అనుబంధ సంస్థ మహిళా రాజ్యం నాయకురాలు శోభారాణి మరో షాక్ ఇచ్చారు. ఇది వరకు రెండు మూడు సార్లు అటువంటి షాక్ లు ఇచ్చి మళ్లీ సర్దుకుపోయారు. తాజాగా ఆమె పార్టీ నిర్వహించిన సమావేశంలోనే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారు. తమ సొంత పార్టీ సోదరీమణులే తనను అవమానించారని ఆమె మీడియా ముందు విమర్శలు చేశారు. మహిళలు, మహిళా నేతలు ఎదుర్కుంటున్న సమస్యలపై ప్రజారాజ్యం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో తెలుగుదేశం, కాంగ్రెసు, వామపక్షాల నాయకులు పాల్గొన్నారు. వారందరి సమక్షంలో మీడియా ఎదుట ఆమె పార్టీలోని మహిళలపై విమర్శలు చేయడం చిరంజీవికి పరోక్షంగా దెబ్బ తగులుతుందని అంటున్నారు.
వెనకబడిన, ఎస్సీ మహిళల సమస్యలపై మాట్లాడడానికి శోభారాణి ముందుకు వచ్చే వరకు అంతా సజావుగానే జరిగిపోయింది. ఆ అంశం ఎజెండాలో లేదని కాంగ్రెసు నేతలతో పాటు ఆమె సొంత పార్టీ నేతలు కూడా శోభారాణిని వ్యతిరేకించారు. ఆమె తన పట్టు విడిచిపెట్టలేదు. తగాదాకు దిగారు. సమావేశం నుంచి ఆగ్రహంగా బయటకు వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. కాంగ్రెసువారే కాకుండా తన సొంత పార్టీ మహిళా నేతలు కూడా తనను అవమానించారని ఆమె విమర్శించారు. శోభారాణి తీరును ప్రజారాజ్యం పార్టీ నాయకుడు కోటగిరి విద్యాధర రావు తప్పు పట్టారు. తామే సమావేశం ఏర్పాటు చేసినందున శోభారాణి తీరు వల్ల ఇతర పార్టీలు నొచ్చుకుంటాయని, శోభారాణికి అవమానం జరగలేదని, చిరంజీవికి ఆమె వల్ల అవమానం జరిగిందని ఆయన అన్నారు.

No comments:

Post a Comment