తెలంగాణ ప్రాంతానికి చెందిన వేలాది మంది విద్యార్థుల్లో తెలంగాణ (ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు)వాదం లేదా? అవుననే అంటున్నారు.. అనేక మంది విశ్లేషకులు. గ్రూప్-1 పరీక్షల నిర్వహణతో ఈ విషయం తేటతెల్లమైందని వారు ఉదహరిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అవిశ్రాంత పోరాటం చేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు మాత్రం నాలుగు కోట్ల మంది ప్రజల్లో అణువణువూ తెలంగాణవాదం ఇమిడి వుందని ఢంకాబజాయిస్తున్నారు.
ఇదే నిజమైతే.. గ్రూప్-1 పరీక్షలు జరుగకుండా ఆ ప్రాంతానికి చెందిన అన్ని రాజకీయ పార్టీల నేతలు చేసిన యత్నాలు పూర్తిగా ఎందుకు విఫలమయ్యాయి. తెలంగాణ ఉద్యమ కేంద్రంగా చెప్పుకునే ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని ఉస్మానియా బీఎడ్ కళాశాలలో జరిగిన పరీక్షలు మినహా ఇతర తెలంగాణ జిల్లాల్లో పరీక్షల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది.
ఇలా ఎందుకు జరిగింది. ఆయా జిల్లాల్లో కరుడుగట్టిన వేర్పాటువాదులు లేరా? తెరాస పార్టీకి చెందిన కార్యకర్తలు లేదా ముఖ్యనేతలు లేరా? వీరెందుకు పరీక్షలను అడ్డుకునేందుకు ప్రయత్నించలేక పోయారు. వాస్తవానికి గ్రూప్-1 పరీక్షలను అడ్డుకునేందుకు తెరాస నేతలు, కార్యకర్తలు చేసిన హడావుడి కంటే.. తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలే ఎక్కువ రాద్దాంతం చేశారు.
హైదరాబాద్‌లో మధుయాష్కీ, మందా జగన్నాథం, గుత్తా సుఖేందర్ రెడ్డి, జి.వినోద్‌లు హంగామా సృష్టించగా, వరంగల్‌లో స్థానిక ఎంపీ రాజయ్య, కరీంనగర్‌లో పొన్నం ప్రభాకర్‌లు హల్‌చల్ సాగించారు. ఇక తెరాస నేతల విషయానికి వస్తే సంగారెడ్డిలో మాత్రం హరీష్ రావు, హైదరాబాద్‌లో నాయిని నర్శింహా రెడ్డి, ఈటెల రాజేందర్‌లు ఆందోళన చేసి అరెస్టయ్యారు. మిగిలిన నేతలంతా పరోక్షంగా గ్రూప్-1 పరీక్షలకు మద్దతు ఇచ్చినట్టుగానే భావించాల్సి ఉంటుందన్నారు.
ముఖ్యంగా, గ్రూప్-1 పరీక్షలకు కేవలం అల్లర్లకు పాల్పడే విద్యార్థులు మాత్రం గైర్హాజరయ్యారు. తమ భవిష్యత్‌పై కోటి ఆశలు పెట్టుకుని ప్రభుత్వం ఉద్యోగం కోసం పోటీ పడుతున్న ప్రతి తెలంగాణ విద్యార్థి ఈ పరీక్షలకు హాజరయ్యారనే విషయాన్ని తేటతెల్లం చేసిందని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒకవిధంగా చెప్పాలంటే తెలంగాణ ప్రాంత విద్యార్థులు వేర్పాటువాదానికి పూర్తిస్థాయిలో అనుకూలంగా లేమని రుజువు చేసినట్లయింది.
తెరాస చీఫ్ కేసీఆర్ చెపుతున్నట్టు కొంతమంది విద్యార్థులు నడుచుకుంటున్నారనే భావన పెక్కుమంది విద్యార్థుల్లో నెలకొందని అందువల్లే ఉస్మానియా జేఏసీ, పొలిటికల్ జేఏసీ, ఇతర రాజకీయ పార్టీలు ఇచ్చిన బంద్ పిలుపును వారు తోసిపుచ్చారని వారు అంటున్నారు. ఫలితంగా తెలంగాణ ప్రాంతాల్లో 35 శాతం మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షలకు హాజరైన విద్యార్థులంతా తమ నిరసనను ఏమాత్రం వ్యక్తం చేయకుండా కిమ్మనకుండా పరీక్ష రాసి వచ్చేశారు. ఇవన్నీ పరిశీలిస్తే.. ఈ ప్రాంత విద్యార్థుల్లో వేర్పాటువాదం (తెలంగాణ) లేదని అంటున్నారు.
No comments:
Post a Comment