Friday, 3 September 2010

జగన్ వర్సెస్ బాబు వర్సెస్ చిరు: అదే అధిష్టానం వ్యూహం..?


వైఎస్సార్ ప్రథమ వర్థంతిని అటు అధిష్టానం - ఇటు వైఎస్ జగన్ వర్గం ఎవరికి వారే అత్యంత ఘనంగా జరిపేందుకు పోటీపడ్డాయి. ఏదేమైనా ప్రజల మనస్సుల్లో గూడుకట్టుకున్న వైఎస్సార్‌కు నాయకులతోపాటు ప్రజలు ఘన నివాళులు అర్పించారు. వర్థంతి ముగిసింది.

ఇడుపులపాయలో ఉవ్వెత్తున ఎగసిపడి వచ్చిన జనాన్ని చూసిన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఈ జనవాహినిని చూసైనా అధిష్టానం తన కళ్ళు తెరవాలని హితవు పలికారు. లేదంటే వైఎస్సార్ కుటుంబం పట్ల పెల్లుబుకుతున్న అభిమానం ఉప్పెనలో అధిష్టానం కొట్టుకపోక తప్పదని హెచ్చరించారు.

ఇక పుల్లా పద్మావతి కన్నీటి పర్యంతమవుతూ.. జగనన్నను అడ్డుకునే శక్తి ఎవరికీ లేదనీ, ఒకవేళ అడ్డుకునే యత్నం చేస్తే ప్రజలే గట్టిగా బుద్ధి చెపుతారన్నారు. మొత్తమ్మీద వైఎస్ జగన్ వర్గం అధిష్టానంతో ఆఖరి పోరాటానికి సిద్ధమైనట్లు స్పష్టంగా కనబడుతోంది. అధిష్టానం ఎంత చెప్పినా ప్రకాశం జిల్లాలో ఓదార్పు యాత్రకే వైఎస్ జగన్ సై అంటూ ముందడుగు వేశారు. తన తండ్రివలే తాను కూడా మడమ తిప్పనని బుజ్జిగించడానికి వచ్చిన మొయిలీతో చెప్పేశారు.
మరోవైపు ఏఐసీసీ అధ్యక్షురాలుగా సోనియా గాంధీ నాలుగోసారి ఎన్నికైన తర్వాత ఆమెకు తొలిరోజు ఎదురవుతున్న పెద్ద తలనొప్పి జగన్ ఓదార్పు యాత్రే. యాత్ర వద్దని ఎన్నిసార్లు హెచ్చరించినప్పటికీ పెడచెవిన పెడుతూ ముందుకు పోతున్న జగన్‌పై సోనియా గాంధీ చర్య తీసుకోవలసిన పరిస్థితి దాదాపు సమీపించినట్లే కనబడుతోంది. ఒకవేళ చర్య తీసుకుంటే.. ఆ తర్వాత జగన్ సొంత పార్టీ పెడితే...? రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి ఎలా ఉండవచ్చన్నదానిపై పలువురు పలు రకాల అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.

అవేంటో ఒకసారి చూద్దాం...
వైఎస్ జగన్ కాంగ్రెస్ పార్టీతో తెగతెంపులు చేసుకుని వేరుకుంపటి పెడితో కాంగ్రెస్‌కు రెండు ప్రత్యామ్నాయాలున్నాయంటున్నారు. అందులో ఒకటి కేసీఆర్ తెరాసను కాంగ్రెస్‌లో విలీనం చేసుకుని ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కాంగ్రెస్ చలవే కనుక ఆ ప్రాంతంలో నూటికి నూరు శాతం కాంగ్రెస్ పార్టీ లబ్ది పొందుతుందంటున్నారు.

ఇక సీమాంధ్రలో ప్రజారాజ్యం పార్టీ విలీనానికి యత్నించడం.. ఒకవేళ కుదరకపోతే చిరంజీవి పొత్తుతో జగన్‌ను ఎదుర్కొనడం. ఈ ఫార్ములాతో సీమాంధ్రలో వైఎస్ జగన్ వర్సెస్ చంద్రబాబు వర్సెస్ చిరంజీవి పోటీ పడతారని, ఈ పోటీలో సామాజిక వర్గాలుగా ప్రజలు చీలిపోతారంటున్నారు. దీంతో వైఎస్ జగన్ అనుకున్న కల నెరవేరే అవకాశం ఉండదని చెపుతున్నారు.
మొత్తమ్మీద జగన్ ప్రయోగిస్తున్న అస్త్రాలకు అధిష్ఠానం వాటికి మించిన బ్రహ్మాస్త్రాలతో సిద్ధంగా ఉందని హస్తినకు చెందిన కొంతమంది సీనియర్ నాయకులు చెపుతున్నారు. అయినా రాజకీయాల్లో ఏదైనా జరుగవచ్చు.. అంటే "వైఎస్ జగన్ ఒక ఫైన్ మార్నింగ్.. మా మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు.. మేమంతా ఒక్కటే" అని సోనియమ్మను ప్రసన్నం చేసుకోవచ్చు.. లేదంటే "అతడు మా కుమారుడు లాంటివాడే.. పిల్లలు తప్పు చేస్తే పెద్దలు క్షమించాల"ని అధిష్ఠానం జగన్‌ను అక్కున చేర్చుకోనూవచ్చు. ఎందుకంటే.. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు కానీ.. శాశ్వత మిత్రులు గానీ ఉండరన్నది జగమెరిగిన సత్యం. సో.. వెయిట్ అండ్ సీ.. !!!

www.Teluguveera.com is not responsible for the accuracy, compliance, copyright, legality,decency, or any other aspect of the content of other linked sites.Sometimes we post the links from other sites that are on the Internet.

No comments:

Post a Comment