Friday, 13 August 2010

వైయస్ జగన్ తప్పుడు యుద్ధం చేస్తున్నారా?


కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ తప్పుడు యుద్ధం చేస్తున్నట్లు అనిపిస్తోంది. తన సమరం దిశను ఆయన సరైన దిశలో ఎక్కుపెట్టలేదని అంటున్నారు. ముఖ్యమంత్రి కె. రోశయ్యపైనే ఆయన ప్రధానంగా ఆరోపణలు ఎక్కుపెడుతున్నారు. పార్లమెంటు సభ్యుడు సందీప్ దీక్షిత్ కు ఆయన ముఖ్యమంత్రిపైనే ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. తనపై రాజకీయంగా దాడి జరుగుతోందని ఆయన చెప్పినట్లు సమాచారం. ప్రతి విషయంలోనూ తనను కార్నర్ చేస్తున్నారని, ముఖ్యమంత్రి ప్రోద్బలంతోనే శాసనసభ్యులు డిఎల్ రవీంద్రారెడ్డి, జెసి దివాకర్ రెడ్డి తనపై ఇటీవల ఆరోపణలు చేశారని, మిగతా నాయకుల వెనక కూడా ముఖ్యమంత్రి ఉన్నారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రిని కలిసి వచ్చి తనపై పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని ఆయన చెప్పినట్లు సమాచారం.

వైయస్ జగన్ ఫిర్యాదును బట్టి ఆయన పరిణామాలను తప్పుగా అర్థం చేసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ అధిష్టానం మేరకే రాష్ట్రంలోని పార్టీ నాయకులు జగన్ వర్గాన్ని టార్గెట్ చేసుకున్నారనే విషయాన్ని అర్థం చేసుకోకపోవడం వల్లనే అలా వ్యవహరిస్తున్నారని అనిపిస్తోంది. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆ తర్వాత రాహుల్ గాంధీ వైయస్ జగన్ ను సాధ్యమైనంత బలహీనం చేసే పనికి ఒడిగట్టారు. కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ కాస్తా మెతగ్గా వ్యవహరిస్తుండడం వల్ల, కెవిపి రామచందర్ రావు ఎత్తుగడల వల్ల జగన్ కు ఎక్కువ సమయం లభించినట్లు కూడా భావిస్తున్నారు. తెలంగాణ పార్లమెంటు సభ్యులు విమర్శలు చేసినా, రాయలసీమ శాసనసభ్యులు ఆరోపణలు చేసినా అది అధిష్టానం ప్రమేయంతోనే జరుగుతుందనే విషయాన్ని జగన్ పసిగట్టకపోవడం మొత్తం వ్యవహారంలో పెద్ద లోపం. పైగా, అధిష్టానానికి జగన్ ఏ మాత్రం విధేయతను ప్రదర్సించడం లేదు. తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి నడిపిన అసమ్మతి రాజకీయాలను ప్రస్తుతం తాను నడుపుతున్నట్లు భావిస్తే జగన్ పప్పులో కాలేసినట్లేనని భావిస్తున్నారు.

www.Teluguveera.com is not responsible for the accuracy, compliance, copyright, legality,decency, or any other aspect of the content of other linked sites.Sometimes we post the links from other sites that are on the Internet.

No comments:

Post a Comment